
కృష్ణచైతన్య ఫార్మసీ కళాశాలలో విచారణ
మదనపల్లె రూరల్ : మండలంలోని రామాచార్లపల్లె కృష్ణ చైతన్య ఫార్మసీ కళాశాలలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కృష్ణ బుధవారం విచారణ చేపట్టారు. సర్టిఫికేట్లు ఇప్పించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులను వేర్వేరుగా ఆయన విచారించారు. కళాశాలకు చెందిన ఎడ్యుకేషనల్ సొసైటీలోని ఓ వర్గానికి చెందిన సెక్రటరి, ప్రిన్సిపల్ శశివర్ధన్‌రెడ్డి, డైరెక్టర్లు శ్యామలమ్మ, గోవర్ధన్‌రెడ్డి, ఎర్రంరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, అమరావతిని విచారించారు. వారు మాట్లాడుతూ....ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం రెండు కంతులు విడుదల చేసినా తమ కళాశాల విద్యార్థులకు జమ కాలేదన్నారు. మరో వర్గానికి చెందిన డైరెక్టర్లు అడ్డుపడుతుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అధ్యాపకులకు వేతనాలు అందించడం కష్టంగా ఉందని, రీయంబర్స్‌మెంట్ విడుదల ఆలస్యం కావడంతో యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని, అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. విచారణ అనంతరం సోషల్ వెల్ఫేర్ డీడీ కృష్ణ మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులు నష్టపోకూడదని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఏఎస్‌డబ్ల్యూఓ గంగిరెడ్డి, వార్డెన్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏకపక్షంగా సోషల్ వెల్ఫేర్ డీడీ విచారణ
మదనపల్లె రూరల్ : కృష్ణ చైతన్య ఫార్మసీ కళాశాలలో జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ ఏకపక్షంగా విచారణ చేశారని కరస్పాండెంట్ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కళాశాల గేటు వద్ద డైరెక్టర్లు మల్లికార్జునరెడ్డి, శశికుమార్‌రెడ్డి, గోపాల్‌రెడ్డిలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ...కొత్తగా సొసైటీ ఏర్పాటుచేసుకుని కళాశాలను నిర్వహించామన్నారు. ఈ విషయమై హైకోర్టులో కేసు వేస్తే తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందన్నారు. అయితే, రెండు నెలల క్రితం ఓ వర్గం కళాశాలను దౌర్జన్యంగా ఆక్రమించుకుని నిర్వహిస్తోందన్నారు. ఈ విషయాన్ని తాము సోషల్ వెల్ఫేర్ డీడీకి తెలిపేందుకు వస్తే, గేట్లు మూసివేసి లోనికి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, సోషల్ వెల్ఫేర్ డీడీ విచారణకు రావడం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. ఏకపక్ష ధోరణితో ఓ వర్గాన్ని మాత్రమే విచారించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఫార్మసీ కళాశాల విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లినా తాము ఊరుకునేది లేదని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.