
హుండీ ఆదాయం రూ.5.23 లక్షలు
తంబళ్లపల్లె: మల్లయ్యకొండపై వెలసిన శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం ఈఓ మునిరాజ, కొండ కిట్టల ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కించారు. నాలుగు మాసాలుగా భక్తులు హుండీ ద్వారా చెల్లించిన కానుకలు లెక్కించారు. రూ.5,23,275 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
నేడు దర్గా స్వామి జయంతి
రామాపురం (రాయ చోటి జగదాంబసెంటర్): రామాపురం మండలం నీలకంఠ్రావుపేట సమీపంలోని దర్బార్ సాయినగర్‌లోని సాయి విద్యామందిర్‌లో ఈ నెల 16న సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ దర్గా స్వామీజీ 95వ జయంతి వేడుకలు చేపడు తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జయంతి ఉత్సవాలకు భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు తెలియజేశారు.
20న జిల్లాస్థాయి హిందీ వ్యాసరచన పోటీలు
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లెలో ఉన్న బీవీఎన్ పాఠశాలలో ఈనెల 20వ తేదీ ఉమ్మడి వైఎస్సార్‌జిల్లా స్థాయిలో ప్రేమ్‌చంద్ హిందీ భవన్ సొసైటీ ఆధ్వర్యంలో హిందీ వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ సర్తాజ్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్‌చంద్ 146వ జయంతిని పురస్కరించుకొని ‘ప్రేమ్‌చంద్‌కి జీవని’ అనే అంశంపై పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రేమ్‌చంద్ జయంతి రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు 6303701314 నంబర్‌కు ఫోన్ చేసి తమపేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకోక పోయినా పోటీ పరీక్ష రోజు నేరుగా కూడా వ్యాసరచన పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు.
ఓపెన్ ఇంటర్‌కు దరఖాస్తులు
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్– 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ సూర్యారావు తెలిపారు. ఓపెన్ ఇంటర్ ద్వారా రెండేళ్ల కోర్సును ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఒక వేళ ఆన్‌లైన్‌లో నమోదు చేయలేనిచో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
గడువు పొడగింపు
రాజంపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ వరకు గడుపు పొడిగించినట్లు పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ సి.రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణులై, ఆసక్తిగల అభ్యర్థులు www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఐటిఐలలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తారని తెలిపారు. ఈనెల 23, 25వ తేదీల్లో ప్రభుత్వ ఐటిఐలలో సీట్ల భర్తీకి, 26, 27వ తేదీల్లో ప్రైవేట్ ఐటీఐలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఏ ఐటీఐలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ ఐటీఐలోనే కౌన్సెలింగ్‌్ ఉంటుందన్నారు. అభ్యర్థులు టెన్త్ మార్కులిస్టు, టిసి, ఆధార్‌కార్డు, రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అభ్యర్థులు కులధృవీకరణ పత్రం వంటివి ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకురావాలన్నారు. అలాగే మెయిల్ ఐడి కూడా ఉండాలని తెలిపారు.

హుండీ ఆదాయం రూ.5.23 లక్షలు

హుండీ ఆదాయం రూ.5.23 లక్షలు