
కర్తవ్యం మరిచి కాసుల వేట
సాక్షి టాస్క్‌ఫోర్స్: పవిత్రమపుణ్యక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి కొలువై ఉన్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం)లో ఖాకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఖాకీ రాజ్యం నడుస్తోందని,రాజ్యాంగపరంగా ఐపీసీ సెక్షన్లు అమలు కావడంలేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ ఠాణా నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్న విమర్శలున్నాయి.న్యాయం మాట అటుంచితే స్టేషన్‌కు వెళ్లాలంటే జనం భయపడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఎస్‌ఐ లేకపోవడంతో ఎవరికివారే ఎస్‌ఐలుగా వ్యవహరించి, అందినకాడికి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. అక్రమ మాఫియాకు అగ్రతాంబూలం లభిస్తోంది. అంటే సామాన్య ప్రజలకు న్యాయం దూరమైందనే వాదనలు ఉన్నాయి. చట్ట విరుద్ధమైన పనులు జరిగితేనే తమ జేబులు నిండుతాయనే ధోరణిలో ఖాకీలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖపరమైన నిఘా వ్యవస్థలు పడకేశాయని, అందువల్ల జిల్లా బాస్‌కు సరైన రీతిలో ఠాణా వ్యవహారం తెలిసినట్లు లేదనే ఆరోపణలున్నాయి.
స్టేషన్ గడప తొక్కాలంటే..
అక్రమంగా, అన్యాయమైన కేసులు, అధికార పార్టీలకు కొమ్ము కాయడం, బాధితుల పట్ల అసభ్య ప్రవర్తన, అక్రమ పనులు చేసే మాఫియాల వద్ద నుంచి నెల సరి మామూళ్ల జోష్ నడుస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. న్యాయం కోసం ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ గడప తొక్కాలంటే జనం భయపడుతున్నారు. న్యాయం చేయండి అంటు వెళ్లిన వారిపై ఎక్కడ తప్పుడు కేసులు పెడతారోనని అటుగా కన్నెత్తి చూడటంలేదు.
ఇటీవల జరిగిన సంఘటనలు..
● 2025 జులై 5వ తేదీన ఒంటిమిట్ట మండలంలోని రాచపల్లికి చెందిన లాలయ్య తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయంలో స్థానిక పోలీసు స్టేషన్ ని ఆశ్రయించాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అసభ్యపదజాలంతో అవమానంగా మాట్లాడారని మనస్థాపంతో రైలు కింద పడ్డాడు. జులై 6న ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ ఎదుట లాలయ్య మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు నిరసన చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
● మండలంలో టీడీపీ వర్గాలు ఆదిపత్య పోరుతో ఒంటిమిట్ట చెరువు మట్టి అక్రమంగా రవాణా చేసే విషయంలో ఓ వర్గం వారు అనుమతి లేని టిప్పర్లను ఉపయోగించడంతో టిప్పర్లను సీఐ బాబు పట్టుకున్నారు. కాని కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణకు దారి తీసింది. తరువాత పోలీసుల పద్దతిలో ఇరు వర్గాలకు బుద్ధి చెప్పారు. ఈ విషయంలో ఖాకీల నిర్లక్ష్యం బహిర్గతమైంది.
● జులై 10వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో స్థానిక హరిత హోటల్‌కు భోజనానికి వచ్చిన కడపకు చెందిన సయద్ గుద్బుద్ధీన్ అనే వ్యక్తి అక్కడ ఘర్షణ పడుతున్న ఇద్దరిని విడదీయబోతే, అప్పుడే వచ్చిన ఒంటిమిట్ట పోలీసు కానిస్టేబుళ్లను చూసి గొడవ పడుతున్న వారు పారిపోయారు. సర్ది చెప్పబోయిన వ్యక్తి సయద్ గుద్బుదిన్‌ను ఆ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించి, బాస్ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు అతన్ని ఒంటిమిట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతని వద్ద ఉన్న రూ. 1,22, 500 లాక్కున్నారని, తెల్లపేపర్‌పై సంతకం పెట్టమంటే పెట్టలేదని తనపై పోలీసు పద్ధతిలో థర్డ్ డిగ్రీ అమలు చేశారని కడప రిమ్స్‌లో బాధితుడు రోదించిన సంగతి తెలిసిందే.
● జులై 11వ తేదీ ఒంటిమిట్ట ఎస్సీ కాలనీలో ఇంటి ఎదురుగా ఉన్న ఓ వివాహిత వద్దకు చదువుకున్న యువకుడు వెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశాడని.. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతనిపై 356– ఎ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి, స్టేషన్ బేయిల్ అడిగితే ఇవ్వకుండా అక్రమ మాఫియా మామూళ్ల మత్తులో నాలుగు రోజుల పాటు ఒంటిమిట్ట పోలీసు స్టేషన్‌లోనే ఉంచుకుని, ఎలాంటి నేర చరిత్ర లేని యువకుడి జీవితాన్ని నాశనం చేసే విధంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఎదుట హాజరు పరచారు. ఉద్దేశ పూర్వకంగా బైండోవర్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన అధికార అహంకారానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మూడునెలలుగా ఎస్‌ఐ లేడు
ఈ ఠాణాలో ఎస్‌ఐ(సబ్ ఇన్‌స్పెక్టర్) లేక 3 నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు ఎస్‌ఐను నియమించకపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అంతా ఒక ఉన్నతాఽధికారే చూసుకుంటున్నారు. రెండు నెలల నుంచి ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ రాష్ట్ర స్థాయిలో రచ్చకెక్కింది. దీంతో పోలీసుస్టేషన్ తీరుతెన్నులపై ఉన్నతస్థాయికి ప్రజల నుంచి ఫిర్యాదులు వెళుతున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పోలీసుస్టేషన్ అపకీర్తిని మూటకట్టుకుంది.
ఒంటిమిట్ట ఠాణాలో ఖాకీల ఇష్టారాజ్యం
అక్రమ మాఫియాకే అగ్రతాంబూలం
పడకేసిన నిఘా వ్యవస్థలు...
ఠాణా గడప తొక్కాలంటే జనంలో భయం

కర్తవ్యం మరిచి కాసుల వేట