
ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
మదనపల్లె రూరల్: ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠినచర్యలు తప్పవని విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం మదనపల్లె మండలంలోని ఐమాక్స్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ భావనా ఆగ్రో ఏజెన్సీస్, రైతుమిత్ర, ప్రసాద్ ఆగ్రోనీడ్స్, కిసాన్ అగ్రిమార్ట్ దుకాణాల్లో స్పెషల్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా.. స్పెషల్ స్క్వాడ్ తనిఖీ బృందంలోని కల్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, తిరుపతి విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. యూరియా బస్తాలను ఎంఆర్‌పీకే విక్రయించాలని, అందరికీ అందుబాటులో తగినన్ని యూరియా బస్తాలు ఉంచాలన్నారు. అనుమతిలేని దుకాణాల్లో ఎరువులు, పురుగుమందులు అమ్మితే చట్టప్రకారం శిక్షలు అమలుచేస్తామన్నారు. తనిఖీల్లో భాగంగా కిసాన్ అగ్రిమార్ట్‌లో అనుమతులు లేని 1లక్ష 14వేల రూపాయల విలువైన పురుగుమందులు సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో మండల వ్యవసాయాధికారి నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.