
పాఠశాలలో స్కౌట్ యూనిట్ తప్పనిసరి
రాయచోటి: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్యణ్యం సూచించారు. రాయచోటి పట్టణం, గాలివీడు మార్గంలోని అర్బన్ కళాశాలలో శుక్రవారం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్‌లోని 250 మంది యూనిట్ లీడర్లకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ దోహదపడుతుందన్నారు. పీఎంశ్రీ పాఠశాలల నుంచి అవగాహన సమావేశానికి గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ స్కౌట్‌లో ప్రవేశం పొందడం వల్ల విద్యార్థులకు దేహదారుఢ్యంతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుందన్నారు. అర్బన్ కళాశాల కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ వల్ల నిజాయితీ, సుగుణ శీలత లాంటి ఉత్తమ పౌరసత్వ లక్షణాలు విద్యార్థులలో పెంపొందుతాయన్నారు. స్కౌట్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కౌట్ కార్యకలాపాలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమీషనర్ లక్ష్మీకర్, అసిస్టెంట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్స్ మహమ్మద్ ఖాన్, సుజాత, స్కౌట్ కమ్యునిటీ డెవలప్మెంట్ సభ్యులు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్యణ్యం