
నిరక్షరాస్యులకు వయోజన విద్య అందించాలి
రాయచోటి: అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు వయోజన విద్యను అందించి 2029 నాటికి జిల్లాను నూరుశాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చడమే ధ్యేయమని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లో అక్షర ఆంధ్ర, ఉల్లాస్ కార్యక్రమాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. అక్షర ఆంధ్ర, ఉల్లాస్ కార్యక్రమాలపై వివిధ అంశాలను కలెక్టర్‌కు విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి వివరించారు. 2024–25లో 13767 మంది ఈ కార్యక్రమంలో వయోజన విద్య తీసుకున్నారని, దాదాపు 91 శాతం మంది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 85605 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. వయోజనులు చదవడం, రాయడమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా దృష్టి పెట్టబోతున్నామని కలెక్టర్ అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పాఠ్యప్రణాళిక పర్యవేక్షణ సిస్టమ్‌లను టీసీఎస్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ప్రభుత్వానికి అందించిందన్నారు. అనంతరం కలెక్టర్ కమిటీలోని వివిధ సభ్యులకు వివిధ సూచనలు చేశారు. గ్రామాల్లో విద్యను అభ్యసించబోయే వారిని గుర్తించడానికి గ్రామ సహాయకులను ఎంపిక చేయాలని, ఎంపిక చేసిన గ్రామ సహాయకులకు తగిన శిక్షణ ఇవ్వాలని డీఆర్‌డీఏ పీడీకి కలెక్టర్ సూచించారు. విద్యనభ్యసించే వారికి తరగతులను ఏర్పాటు చేసేందుకు అంగన్ వాడీ కేంద్రాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీకి సూచించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పాల్గొనే పురుషులను ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేసి అక్షరాస్యతను పెంచాలని డ్వామా పీడిని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్