
పంచాయతీ పురోగతిపై శిక్షణ
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు రాయ చోటి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక 2.ఓపై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు డీఎల్‌డీఓ లక్ష్మీపతి, డీపీఓ రాధమ్మ, డ్వామా పీడీ వెంకటరత్నం తెలిపారు. వీరికి పీఆర్ డీఈ దయాకర్‌రెడ్డి, డీఏఓ శివనారాయణ, డీఈఓ సుబ్రమణ్యం, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణలు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ పురోగతి సూచిక 2.ఓ ఫైనాన్షియల్ ఇయర్ 2023–24లో భాగంగా 2025–26 ఫైనాన్షియల్ ఇయర్‌కి గాను, పంచాయతీ పురోగతి ప్రణాళికలను తయారు చేయుటపై శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, కడప, చిత్తూరు డీపీఆర్‌సి సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నేపల్లి పాఠశాల సందర్శన
అట్లూరు: అట్లూరు మండలం చెన్నేపల్లి ప్రాథ మిక పాఠశాలను మంగళవారం డీఈఓ షంషుద్దీన్ తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఈఓ వచ్చిన విషయం తెలుసుకున్న చెన్నేపల్లి కాలనీ వాసులు అక్కడకు చేరుకున్నారు. ‘అయ్యా మా పాఠశాలలోని 3,4,5 తరగతుల విధ్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు తరలించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. అలా జరిగితే మాపిల్లలను మేం పంపియ్యం.. 5వ తరగతి వరకూ మా కాలనీలోనే చదువు చెప్పాలి’ అని విన్నవించారు. స్పందించిన డీఈఓ ఈ సమస్య గురించి విధ్యాశాఖ జాయింట్ డైరెక్టరుకు పంపించామని.. అక్కడ నుంచి ఉత్తర్వులు అందే వరకూ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగుతుందని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.