
కృత్రిమ మేథపై నైపుణ్యం సాధించాలి
రాయచోటి: నేటి ప్రపంచంలో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు కృత్రిమ మేథ నైపుణ్యాన్ని గడించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డైట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డైట్ పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వృత్తి విద్య శిక్షణ అందుబాటులో ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిష్ణాతులైన ట్రైనర్‌లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పాఠ్యాంశాలకు అదనంగా చిన్నప్పటి నుండి వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చన్నారు. నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మై ట్రేడ్, మై డ్రీమ్ పేరుతో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు, కేస్ స్టడీస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులతో ఏర్పాటు చేసిన కెరీర్ పాత్ చార్ట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి, సమగ్ర శిక్ష సిఎంఓ కరుణాకర్, ఏపీఓ చంద్రశేఖర్, జిల్లా ఒకేషనల్ కో–ఆర్డినేటర్ యోగేష్ కుమార్ రెడ్డి, పాఠశాల ఒకేషనల్ ట్రైనర్లు మహబూబ్ బాష, రామాంజనేయులు, సాయి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.