
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించండి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
గుర్రంకొండ : ప్రభుత్వ భూముల ఆక్రమణలను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం మండలంలోని అరిగెలవారిపల్లెలో ఆయన పర్యటించారు. ఇటీవల గ్రామానికి చెందిన కొంత మంది దారి సమస్య, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పందన కార్యాక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకొని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. సర్వే నెంబరు 26/2లో మేతబీడు పోరంబోకు భూములు 10.30 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో గుర్తించారు. రికార్డుల ప్రకారం భూములు ఉన్నా.. వాస్తవంగా సదరు భూములు ఆక్రమించుకొని పలువురు ఇళ్ల నిర్మాణాలు, కంచెలు వేసుకున్నట్లు గుర్తించారు. ఆక్రమణదారులు స్థలాలు ఆక్రమించుకోవడమే కాకుండా.. ఆవతలివైపు ఇళ్లకు వెళ్లే దారులను కూడా కబ్జా చేసి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించకొన్న వారిని సర్వే చేసి మూడు సెంట్ల స్థలం మాత్రమే ఉంచి మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెవెవెన్యూ అధికారులను ఆదేశించారు. మిగతా భూముల్లో కంచెలు వేసి ఉన్న స్థలాలను స్వాఽధీనం చేసుకొని కంచెలను తొలగించాలన్నారు. కబ్జాకు గురైన దారి స్థలాలను సర్వే చేసి మొత్తం మేతబీడు పోరంబోకు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీప్రసన్న, వీఆర్వో నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది రిజిష్టరు, మందుల రిజిష్టర్, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని, కొన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఆస్పత్రి వైద్యులు చైతన్య కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖాళీలపై ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి చైతన్య, సీహెచ్‌వో సీతారామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.