
మంత్రి మండిపల్లిపై సోషల్ మీడియా పోస్టింగులు
రాయచోటి : రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిపై ఫేస్‌బుక్‌లో అభ్యంతకరమైన కామెంట్ పెట్టారంటూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎరమాల అన్వేష్ రెడ్డి(29)ని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ సీఐ వెంకటచలపతి వెల్లడించారు. ఈ నెల 12న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా సోషల్ మీడియా వేదికగా అభ్యంతకరమైన కామెంట్స్ పోస్ట్ చేయడంపై మంత్రి పీఏ రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇతనితోపాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న అన్వేష్ రెడ్డి పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకు హాజరు పరిచామన్నారు. కోర్టు అన్వేష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన అన్వేష్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ అభిమాని అని తెలిసింది.
ఖమ్మం జిల్లా వాసి అరెస్ట్..
బెయిల్‌పై విడుదల