
గ్యాంగ్‌ల దాడులు.. ప్రజలు బెంబేలు
రాయచోటి : ప్రశాంతంగా ఉన్న రాయచోటి పట్టణంలో.. ఇటీవల గ్యాంగుల దాడులు, ప్రతిదాడులతో పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. పీకలదాకా మద్యం తాగి మత్తులో చేస్తున్న దాడులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణంలో బోనమల ఖాదర్‌వల్లి గ్యాంగ్, సున్నా గ్యాంగ్, కొత్తపల్లి గ్యాంగ్, కొత్తపేట రామాపురం గ్యాంగ్, పాతరాయచోటి గ్యాంగ్ ఇలా బ్యాచ్‌లుగా ఏర్పడి.. వీరంగం సృష్టిస్తున్నారు. గ్యాంగులుగా ఏర్పడి విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతికి శాఖాపరంగా మంచి పేరుంది. కూటమి పాలన వచ్చిన తర్వాత పట్టణంలో గ్యాంగుల దాడులు, అల్లరి మూకల అలజడి అధికం కావడంతో.. జిల్లా ఎస్పీ నేరుగా కర్నూలు జిల్లాలో పని చేస్తున్న బీవీ చలపతిని రాయచోటి అర్బన్ సీఐగా నియమించారు. సీఐ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ప్రశాంతత నెలకొంటుందని భావించిన ప్రజలకు.. అధికార పార్టీ ఆధిపత్యం ముందు అంతో ఇంతో కఠినంగా ఉండే అర్బన్ సీఐ కూడా గ్యాంగులను నిలువరించలేని పరిస్థితిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
మైనార్టీ నేతపై కత్తులతో దాడి
కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాయచోటి పట్టణ పరిధిలో వరుస దాడులు జరుగుతున్నా వారిపైన కేసులు మాత్రం నమోదు కావడం లేదు. గత నెల 23న చిత్తూరు రింగ్ రోడ్డు, ఈ నెల 3న కొత్తపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో, 4వ తేదీన కొత్తపేట రామాపురం పరిధిలోని నాలుగు కులాయిల వద్ద, 9వ తేదీన ట్రంక్ రోడ్డు మీద ఓ మైనార్టీ నేతపై కత్తులతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఈ దాడులన్నీ బోమనల ఖాదర్‌వల్లి గ్యాంగ్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మిగిలిన బ్యాచ్‌లు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో పీకల దాకా మద్యం తాగి దాడులకు తెగబడుతున్నారు. పట్టణంలో సాగుతున్న వరుస దాడులతో పలువురికి గాయాలు అవుతున్నాయి. అనేక వాహనాలు దగ్ధమవుతున్నాయి. వీరిపై స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేని స్థితిలో పోలీసులు ఉండటం గమనార్హం. వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్న వీరి తీరుతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాడులు, అల్లర్లపై వారించిన స్థానికులపై కత్తులు, రాడ్లు, ఫింగర్ గ్రిప్ కత్తులతో దాడులు చేసి గాయపరుస్తున్నారు. మైనార్టీ నేత బాషాపై బోనమల అనుచరుల దాడులు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ప్రశాంతత వైపు అడుగు లేస్తుంది అనుకున్న రాయచోటిలో దాడులు, ప్రతిదాడులతో.. గ్యాంగుల అలజడులు పట్టణ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారమే అండగా రెచ్చిపోతున్న గ్యాంగులకు అధికార పార్టీ నాయకులు వత్తాసు పలకడంతో మరింత రెచ్చిపోతున్నారు.
రాయచోటిలో మొదలైన హింసాకాండ
చేతుల్లో రాడ్లు, కత్తులు,
ఫింగర్ గ్రిప్ కత్తులతో హల్‌చల్
మద్యం తాగి వీధుల్లో భయభ్రాంతులు
సృష్టిస్తున్న వైనం
అధికార పార్టీ నేతల ఒత్తిడితో
మిన్నకుండిన పోలీసులు

గ్యాంగ్‌ల దాడులు.. ప్రజలు బెంబేలు