
అంజన్న మూలవిరాట్ దర్శనమే లక్ష్యం
చక్రాయపేట : శిలాఫలకాల్లో పేర్లు వేయుంచు కోవాలన్నది మా ఉద్దేశం కాదని, భక్తులకు వీరాంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం కల్పించాలన్నదే ముఖ్యమని గండి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ టీడీపీ నేతలకు సూచించారు. గండిలో ఆలయ పాలకమండలి సభ్యులతో కలిసి సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేంపల్లె మండల టీడీపీ ఇన్‌చార్జి రఘునాథరెడ్డి గండి ఆలయాన్ని శనివారం పరిశీలించి విలేకరుల సమావేశంలో తమపై పలు ఆరోపణలు చేశాడన్నారు. ఆలయం పనులు సుమారు 95 శాతం పూర్తయ్యాయని, పునఃప్రతిష్ట చేసి భక్తులకు శ్రావణ మాసం నాటికి మూల విరాట్ దర్శనం కల్పించాలని గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవ దాయ శాఖమంత్రి, కమిషనర్, బీజేపీ, కాంగ్రెస్, నేతలతోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమ విన్నపాలకు స్పందించి విచారణ నిమిత్తం ఆర్జేసీ, కలెక్టర్, డిప్యూటీ కమిషనర్‌లు గండికి వచ్చి శ్రావణ మాసం నాటికి పునఃప్రతిష్ట జరిపించాలని ఆదేశించారని చెప్పారు. ఆగిన పనులు తమ విన్నపాలతోనే ఊపందుకున్నాయని చెప్పారు. తాము కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. పునః ప్రతిష్టకు సంబంధించి కనీసం 6 అడుగుల ప్రాకారం, దీప స్తంభం ఉండాలని, బలిపీఠం కావాలని అధికారులు చెప్పారని తెలిపారు. వారు చెప్పినట్లు ప్రాకారం 6 అడుగులు, దీపస్తంభం ఉందని, బలిపీఠం ఒక్కటే లేదని చెప్పారు. నాలుగేళ్లుగా భక్తులకు మూల విరాట్ దర్శనం లేదని ఇప్పుడైనా ఆ అవకాశం కల్పించాలని తాపత్రయ పడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు బోరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ బోర్డు సభ్యుడు బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రావణమాసంలో కల్పించేందుకు ఏర్పాట్లు
ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ