
మద్యం తాగవద్దన్నందుకు ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : మద్యం తాగవద్దన్నందుకు మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. సీటీఎం పంచాయతీ పడమటవీధికి చెందిన రాజయ్య(62) కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. కొంత కాలంగా మద్యానికి తీవ్రంగా బానిసై ప్రతి రోజు ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఉదయాన్నే మద్యం తాగి రావడంతో.. భార్య రాజమ్మ భర్తతో గొడవపడి మద్యం తాగవద్దంటూ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య ఇంటికి సమీపంలోనే ముష్టిచెక్క తిని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు.