
మున్సిపల్ వాటర్, విద్యుత్ సిబ్బంది సమ్మె బాట
రాయచోటి టౌన్ : గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన మున్సిపల్, విద్యుత్ శాఖ (ఇంజినీరింగ్)ల సిబ్బంది శనివారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సమ్మెబాట కార్యక్రమం ప్రారంభించారు. మొదటి రోజు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామాంజులు సమ్మెలో పాల్గొన్న వారికి పూలమాల వేసి దీక్షలు ప్రారంభించారు. అలాగే మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీవీ రమణతో కలసి ఆటో ప్రచారాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గత నెల రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని, షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పని ముట్లు ఇవ్వాలని, రక్షణ పరికరాలు అందివ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కార మార్గం చూపలేదన్నారు. అందుకే సమ్మె బాట పట్టామని తెలిపారు. మెప్మా ఆర్‌పీలకు, ట్రైబల్ టీచర్స్, గెస్ట్ టీచర్స్‌కు జీతాలు పెంచారు కానీ 2005 నాటి నుంచి నేటి వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తి కావస్తోందని, కేవలం రూ.15 వేలు వస్తోందని వీటిలో కటింగ్‌లు పోను రూ.13 వేలు మాత్రమే చేతికి వస్తోందన్నారు. ఇక వెలిగల్లు ప్రాజెక్టు పంప్ హౌస్‌లో పని చేస్తున్న ఆరుగురికి 14 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, దీనిపై కోర్టు జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. పెడచెవిన పట్టారని ఆరోపించారు. ఏడు సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ సిబ్బంది జీతాల పెంపునకు నోచుకోలేదన్నారు. జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచేదాకా నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సిబ్బంది అక్బర్, శంకరయ్య, ఈశ్వరరెడ్డి, మల్లిఖార్జున, రమణ, రమేష్, రమాదేవి, వెంకటలక్ష్మి, మౌనిక, దేవా, కృష్ణారెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.