
చెరిపితే చెరిగేది కాదు.. జగనన్న మార్కు..
రాయచోటి : రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కు.. చెరిపితే, చెరిగిపోయేది కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంతంగా ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకురాలేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన అమ్మఒడిని తన కుమారుడు లోకేష్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పేరెంట్స్ మీటింగ్‌లో సీఎం హోదాలో చంద్రబాబు మొత్తం అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అమ్మఒడి పథకం ఎవరు తెచ్చారన్నది రాష్ట్రంలో చిన్నపిల్లలను అడిగినా చెబుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం తడబడకుండా అబద్ధాలు ఆడగలరన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి రావటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా ఏ నాడు విద్యావ్యవస్థపై దృష్టి పెట్టకపోగా.. సత్యమే పలకవలెనని నేర్పించే పాఠశాలలకు వెళ్లి పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న రీతిలో చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. 2017లో వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో చెప్పిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే అమ్మఒడి ద్వారా తల్లులకు డబ్బులు అందించిన ఘనత జనగన్నకు దక్కుతుందన్నారు. అయితే ఏడాది డబ్బులను అనేక మంది తల్లులకు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదన్నారు. మనబడి, నాడు నేడు పేరుతో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసింది కూడా జగన్ ప్రభుత్వంలోనే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం, డిజిటల్ విద్యా రంగాన్ని ప్రారంభించింది జగనన్న అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన నాణ్యత లేని బ్యాగ్, నాసిరకం భోజనంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జగనన్న గోరు ముద్ద పథకాన్ని కూటమి ప్రభుత్వం ఘోరమైన ముద్దగా మార్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న పథకాలను ప్రజలు జీవితకాలం మరచిపోరని ఆమె వివరించారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు ఒక్క పథకాన్నైనా తెచ్చారా?
రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు గౌరీరెడ్డి