
సెయింట్ లూయిస్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి
రాజంపేట : యూఎస్‌ఏలోని సెయింట్ లూయిస్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శనివారం రాత్రి వైఎస్సార్‌సీపీ యువనేత చిల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన మాటల్లోని మానవతాస్ఫూర్తి గురించి కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు మాట్లాడారు. వారి జీవితాల్లో వైఎస్సార్ ప్రభావం గురించి, వ్యక్తిగత అనుభవాలను హృద్యంగా పంచుకున్నారు. గతంలో 2007లో వైఎస్సార్ సెయింట్ లూయిస్ పర్యటనలో ఇదే కన్వెన్షన్ హాల్‌లో పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడారని ప్రవాసాంధ్రులు గుర్తు చేసుకున్నారు. అదే వేదికపై ఆయన జ్ఞాపకాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, కడప మోహన్‌రెడ్డి తమ మధుర జ్ఞాపకాలను, వైఎస్సార్ జీవితంలో చిరస్మరణీయ ఘట్టాలను పంచుకున్నారు. వైఎస్సార్ జయంతి సభ వీక్ ఎండ్స్‌లో చేయాల్సి వచ్చిందన్నారు. చికాగో, మెంఫిస్, కాన్సాస్ వంటి నగరాల నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారన్నారు. సభలో కన్వీనర్ సుబ్బారెడ్డి, పమ్మి, సందీప్, రాఘవరెడ్డి, నవీన్, గూడువల్లి, మహేష్, గోపాల్, తాటిపర్తి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.
2007లో వైఎస్సార్ మాట్లాడిన
పబ్లిక్ మీటింగ్ వేదికపైనే వేడుకలు