
న్యాయ వ్యవస్థలో మీ పాత్ర కీలకం
రాయచోటి : న్యాయ వ్యవస్థలో మీరు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని, కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగడానికి, కోర్టుల గౌరవాన్ని నిలబెట్టడానికి మీ కృషి ప్రశంసనీయమని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. శనివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుల ఆదేశాల మేరకు జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, లైజనింగ్ ఆఫీసర్లు, జిల్లా లీగల్ లైజన్ యూనిట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకు హాజరయ్యే ప్రజలు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో నేరుగా వ్యవహరిస్తారన్నారు. ఈ క్రమంలో మీరు ప్రదర్శించే నిబద్ధత, నిజాయితీ, వృత్తి నైపుణ్యం చాలా ముఖ్యమైనవన్నారు. కేసుల విచారణకు అవసరమైన పత్రాలను సమర్పించడం నుంచి సాక్షులను కోర్టుకు హాజరుపరచడం వరకు మీరు చేసే ప్రతి పనిలో కచ్చితత్వం, సమయపాలన పాటించాలని సూచించారు. కోర్టు అధికారులు, న్యాయవాదులతో సమర్థవంతమైన సమన్వయం చేసుకోవడం ద్వారా కేసుల పురోగతికి సహాయపడాలని కోరారు. సాక్షులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాంగ్మూలం ఇచ్చే వాతావరణం కల్పించాలన్నారు. కోర్టు ప్రాంగణం, వెలుపల బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎం.తులసీరాం, డిస్ట్రిక్ట్ లీగల్ లైజన్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డి, ఎస్‌ఐ రవికుమార్, జిల్లా వ్యాప్తంగా కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులు పాల్గొన్నారు.
రాత్రి రెక్కీ.. పగలు నొక్కి..
రాయచోటి టౌన్ : తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. శనివారం రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన కథనం మేరకు.. తిరుపతి జిల్లా గూడూరు, గాంధీనగర్‌కు చెందిన రంగనాథం కిరణ్ బేకరీలో పనిచేసేవాడు. అక్కడ వచ్చే ఆదాయం చాలకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. తొలుత బస్టాండ్ ఆవరణంలో చిన్న చిన్న జేబుదొంగతనాలు చేసేవాడు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు రాకపోవడంతో ఇళ్లలో చోరీలు చేయడం మొదలు పెట్టాడు. చోరీ చేసే ముందు రెండు,మూడు రోజులు ఆ ప్రాంతంలో రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహిస్తాడు. ఇంటిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత పగటి పూటే చోరీలు చేసేవాడు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని చిట్వేలిలో రెండు కేసులు, రైల్వేకోడూరులో ఒకటి, వీరబల్లిలో మూడు కేసులతో పాటు ఇతర జిల్లాల్లో 56 కేసులు ఇతనిపై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వీరబల్లిలో జరిగిన ఒక చోరీ సంఘటనలో నిఘా పెట్టిన పోలీసులకు శనివారం వీరబల్లి మండలం ఓదివీడు రోడ్డు వద్ద నిందితుడు కనిపిండంతో రూరల్ సీఐ వరప్రసాద్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు యం. చంద్రశేఖర్, ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, వీరబల్లి ఎస్‌ఐ నరసింహారెడ్డిలు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 102 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10,75,000లుగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోర్టు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో జిల్లా అదనపు ఎస్పీ
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
102 గ్రాముల బంగారు, రూ.75 వేలు నగదు స్వాధీనం

న్యాయ వ్యవస్థలో మీ పాత్ర కీలకం

న్యాయ వ్యవస్థలో మీ పాత్ర కీలకం