
ప్రశ్నార్థకంగా హైవే కనెక్టివిటీ!
రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం సాగించే గ్రీన్‌హైవే( కడప–రేణిగుంట నేషనల్ హైవే నుంచి అప్రోచ్‌రోడ్స్ నిర్మితం) ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి హైవే నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న వైల్డ్‌లైఫ్ అనుమతులు రావడంతో త్వరలోనే నిర్మాణ పనులు జరుగుతాయని భావిస్తున్నారు. రూ.4వేల కోట్ల వ్యయంతో రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన రహదారి అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధాన పుణ్య క్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరు, తాళ్లపాకకు కనెక్టివిటీ అప్రోచ్‌రోడ్స్‌పై క్లారిటీ రాలేదన్న ఆందోళన ఇక్కడి ప్రాంతీయుల్లో నెలకొంది.
ఒంటిమిట్ట, నందలూరుకు వెళ్లేదెలా..
కడప–రేణిగుంట నేషనల్ హైవేలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరుకు యాత్రికులు, భక్తులు, పర్యాటకులు వెళ్లేదేలా అన్న సందేహాలు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర అధికారిక రామాలయం ఒంటిమిట్టలో ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయం సౌమ్యనాథాలయం నందలూరులో ఉంది. ఈ రెండు కేంద్రాలకు ప్రత్యేకంగా సర్వీసు రోడ్డును తీసుకురావాలని, అవసరమైతే భూసేకరణ చేసైనా నిర్మించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో నందలూరు, ఒంటిమిట్ట వాసులు ఆందోళన చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
● మేజర్ పంచాయతీ కేంద్రమైన నాగిరెడ్డిపల్లె శివార్లలో నుంచి నిర్మితం కానున్న కడప–రేణిగుంట హైవే నుంచి నందలూరు బస్టాండు కేంద్రానికి కనెక్టివిటీని కోరుతున్నారు.
● ఒంటిమిట్టకు రాములోరి కల్యాణ మండపం సమీపం నుంచి ఇస్తే పుణ్యక్షేత్రాల సందర్శనకు అనుకూలంగా ఉంటుందని యాత్రికులు కోరుతున్నారు.
● ఒంటిమిట్ట, నందలూరు మండల కేంద్రాలకు సంబంధం లేని ఏరియాలో సుదూర ప్రాంతంలో అప్రోచ్‌రోడ్డు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని పేర్కొంటున్నారు.
● అలాగే పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాక–నందలూరు కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది.
దక్షిణ భారతీయులకు..
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి, చైన్నె నగరాలకు వెళ్లే వారు ఈ హైవేలో అధికంగా పయనిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒంటిమిట్ట, నందలూరుకు నేరుగా కనెక్టివిటీ లేకపోవడం అసౌకర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు సర్వీసు (కడప–రేణిగుంట పాతరోడ్డు) రోడ్డుగా మారుతుంది. ఈ దారిలో దూరప్రాంతాలకు చెందిన హైవేలోనే తిరుపతి, చైన్నె తదితర ప్రాంతాలకు వెళ్లనున్నారు. పైగా త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. హైవేలో పయనించనున్నారు.
ఎంపీల దృష్టికి పుణ్యక్షేత్రాల కనెక్టివిటీ..
జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్‌హెచ్ నుంచి కనెక్టివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని రాజంపేట లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రికులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకోవడం ఇటీవల అధికమైంది. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందిన ఒంటిమిట్ట, నందలూరుకు ఎన్‌హెచ్ నుంచి ప్రత్యేకంగా సర్వీసురోడ్డు నిర్మితం చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒంటిమిట్ట, నందలూరుకు నేరుగా అనుసంధానం కోసం డిమాండ్
సౌమ్యనాథాలయం, ఒంటిమిట్ట, తాళ్లపాకలను గుర్తించాలి
అప్రోచ్‌రోడ్డు వల్ల యాత్రికుల రాకపోలకు సౌకర్యం
హైవే నుంచి ఒంటిమిట్టలోకి కనెక్టివిటీ రోడ్డు వేయాలి
త్వరలో నిర్మితం కానున్న గ్రీన్‌హైవే( కడప–రేణిగుంట నేషనల్‌హైవే) నుంచి పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్టకు సర్వీసురోడ్డు నిర్మితం చేయాలి. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలు లేవన్న ఆందోళన ఒంటిమిట్ట ప్రాంతీయులను కలచి వేస్తోంది. ఎక్కడో అటవీ ప్రాంతంలో అప్రోచ్‌రోడ్డు నిర్మితం చేయడం వల్ల ఉపయోగంలేదు. రామయ్య కోవెలకు అనుకూలంగా అప్రోచ్‌రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది.
– ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి,
జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్, ఒంటిమిట్ట
నందలూరుకు నేరుగా కనెక్టివిటీ అవసరం
పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట, నందలూరుకు త్వరలో నిర్మితం కానున్న గ్రీన్‌హైవే నుంచి నేరుగా కనెక్టివిటీ అవసరం ఉంది. అప్రోచ్‌రోడ్డు లింక్ నాగిరెడ్డిపల్లె నుంచి నందలూరు బస్టాండుకు ఉండాలి. ఎక్కడో మండలానికి దూరంగా కనెక్టివిటీ అక్కర్లేదు. అన్ని రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. సౌమ్యనాథాలయం, సీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలు, సమీపంలోని అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక ఉన్నాయనే నేషనల్ హైవే అధికారులు గుర్తించాలి.
–మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ, నందలూరు

ప్రశ్నార్థకంగా హైవే కనెక్టివిటీ!

ప్రశ్నార్థకంగా హైవే కనెక్టివిటీ!