
పోలీసుల అదుపులో రాయచోటి వాసులు !
రాజంపేట : సోషల్ మీడియాలో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుపై ఆయన పరువుకు భంగం కలిగించేలా వీడియోను పోస్టు చేశారని రాజంపేటకు చెందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత శివకుమార్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాయచోటికి చెందిన రామచంద్ర, రామకృష్ణ, సూరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా టీడీపీ ఇన్‌చార్జి రేసులో చమర్తి కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెరపైకి వచ్చిన సోషల్ మీడియా పోస్టు పెట్టడానికి కారణమనే భావన తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ వర్గాల్లో దుమారం రేపిన వీడియో...
పోలీసుల అదుపులో ఉన్న వారు విడుదల చేసినట్లుగా చెబుతున్న వీడియో టీడీపీ వర్గాల్లో దుమారం రేపింది. టీడీపీలో చమర్తి వ్యతిరేక వర్గానికి చెందిన వారే వీడియో వైరల్ చేశారనే భావనలో చమర్తి వర్గీయులు ఉన్నారు. రాయచోటికి చెందిన వారి వెనుక ఉన్న నేత ఎవరు అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై పట్టణ సీఐ రాజాను వివరణ కోరగా సోషల్ మీడియాలో చమర్తి జగన్‌మోహనరాజుపై వీడియో విడుదల చేసిన వారిని విచారిస్తున్నామని వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె ; చిన్న ఓరంపాడులోని నాయుడు డాబా వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఇన్నోవా కారు ఢీ కొనడంతో సోమశిల శ్రీనివాసులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చెన్నూరు పడమటి వీధి గ్రామానికి చెందిన సోమశిల శ్రీనివాసులు మండలంలోని చిన్న ఓరంపాడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ తమలపాకు తోటల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ లాగే తోటలో పని ముగించుకొని మధ్యాహ్నం భోజనం కోసం నాయుడు డాబా వద్దకు జాతీయ రహదారిపై వస్తుండగా వేగంగా ఇన్నోవా కారు ఢీ కొంది. దీంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ మహేష్ నాయుడు సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనంలో శ్రీనివాసులును రైల్వేకోడూరుకు తరలించారు. మార్గమధ్యంలో శ్రీనివాసులు మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఇద్దరు కుమారులు స్వగ్రామంలో ఉన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు.
వక్ఫ్‌బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం
ప్రొద్దుటూరు : మండల పరిధిలోని టీచర్స్ కాలనీ వెనుక ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ స్థలంలో ఉన్న టైర్లతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు లేచాయి.