
మున్సిపల్ వర్కర్లకు సంక్షేమ పథకాలేవీ?
రాయచోటి టౌన్ : మున్సిపల్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నేతలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కో కన్వీనర్ నేలపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వర్కర్స్, ఆప్కాస్ వర్కర్స్‌కు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తక్షణమే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, టౌన్ ఫ్లానింగ్ సిబ్బందికి రూ.24,500లకు వేతనం పెంచాలని కోరారు. జీవో నంబర్ 36 ప్రకారం వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఆరు నెలల డీఏ, గ్రాట్యూటీ విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో దేవా, తిరుమల, చలపతినాయుడు, శేషాద్రిబాబు, కేశవరావు, వెంకటేష్, రాధ, చంద్ర, నరసింహులు, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.