
కూటమి మోసాలను ప్రజా కోర్టులో నిలబెడదాం
బి.కొత్తకోట/కురబలకోట : రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు మోసపూరిత వాద్ధానాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిలువునా దగా చేశారని, బాబు నయవంచన గురించి ఇంటింటా వివరించాలని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బి.కొత్తకోట పీఎన్‌ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు మోసాలపై క్యూఆర్ కోడ్‌ను నాయకులు ఆవిష్కరించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లెకు జగన్ ప్రభుత్వంలో మంజూరైన కోట్లాది రూపాయల నీటి పథకాలు, ముదివేడు రిజర్వాయర్ తదితర పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వెనుక బడిన తంబళ్లపల్లెను తాము ప్రగతి పథంలో నిలిపామన్నారు. జగన్ పర్యటనల సందర్భంగా జన స్పందన చూసి కూటమి అధినాయకులు అదిరిపోతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశాడని, ఏవర్గం సంతృప్తికరంగా లేదన్నారు. జగన్ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు జరిగాయని, చంద్రబాబు పాలనలో మోసం గ్యారంటీ అని విమర్శించారు. అనంతరం ముఖ్య అతిథి ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కొత్తగా చేరిన పార్టీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, పూర్ణ చంద్రిక, రమేష్, ఎంజి భూదేవి, నారాయణరెడ్డి, భాస్కర్ నాయుడు, అనిత చక్రవర్తి, బలరామిరెడ్డి, చౌడేశ్వర, మహమ్మద్, శివన్న, కళ్యాణ్,రెడ్డి హరి, తదితరులతో పాటు నియోజక వర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి