
బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ శ్రీధర్
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారవేదిక ద్వారా స్వీకరించిన ప్రజా విజ్ఞప్తులను నిశితంగా పరిశీలించి వాటిని ఎప్పటికప్పుడు బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టిసారించి నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో వ్యవసాయ శాఖ ఖరీఫ్ 2025 పంటలబీమాకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను కలెక్టర్ చామకూరి శ్రీధర్, జేసీ ఆదర్శరాజేంద్రన్‌లు విడుదల చేశారు.
10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌ను నిర్వహిస్తున్నామని, తల్లి పేరుమీద ప్రతి విద్యార్థితో మొక్క నాటించడం ద్వారా తల్లిదండ్రులపై, పర్యావరణంపై బాధ్యత పెంపొందుతాయని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజిఆర్‌ఎస్ హాల్‌లో ఈనెల 10న నిర్వహించబోయే మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌పై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డిఈఓ, డీఐఈఓ, ఎంఈఓలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, ఎంపీడీఓలు, రాజంపేట అడిషనల్ ఎస్పీ మనోజ్ రామనాథ్ హెడ్గేలతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో దాదాపు రెండు లక్షల, 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి దాదాపు 6,75,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.