రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం ఎస్.ఉప్పరపల్లి వద్ద సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చైన్నె నుంచి ఎర్రగుంట్లకు పల్సర్ బైక్‌పై వెళ్తున్న బి.గోపాల్ (25)ను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాహిత అదృశ్యం
మదనపల్లె రూరల్ : వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. సుండుపల్లెకు చెందిన మాధవి(20)కి, పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు విజయ్‌కుమార్‌తో పదినెలల క్రితం వివాహమైంది. ఆమె ఇంటి వద్దే ఉంటుండగా, భర్త విజయ్‌కుమార్ స్థానికంగా చేనేత పనులకు వెళ్లేవాడు. ఈనెల 26న ఉదయం 7 గంటలకు విజయ్‌కుమార్ పనులకు వెళ్లి పది గంటలకు టిఫిన్ చేసేందుకు ఇంటికి రాగా, భార్య మాధవి కనిపించకపోవడంతో ఆమె సెల్‌కు ఫోన్‌చేశాడు. సమాధానం రాకపోగా ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో పలుచోట్ల కుటుంబ సభ్యులతో కలిసి గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు
కొండాపురం : మండల పరిధిలోని పాత తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని శివాలయంలో ఆదివారం రాత్రి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. గండికోట జలాశయంలో ముంపునకు గురైన గ్రామాల్లో ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయని దొంగలు టార్గెట్ చేస్తున్నారు. పాత తాళ్లప్రొద్దుటూరు లోని శివాలయం గుడిలో శివ లింగం చుట్టు తవ్వకాలు చేపట్టడంతో సోమవారం మండల తహసీల్దార్ గుర్రప్ప, స్థానిక పోలీసులు పరిశీలించారు. ముంపు గ్రామాల్లో జనసంచారం లేకపోవడంతో పురాతన ఆలయాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.