
ఉపాధిలో అంతులేని అవినీతి
రాయచోటి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకంలో అవినీతి అంతులేకుండా పోయిందని జిల్లాలోని ప్రజాప్రతినిధులు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు సోమవారం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
డిమాండ్లు
● ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలి
● రైతు, కూలీ శ్రామికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు.
● ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే నిర్వహించి కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి.
● సర్పంచులకు తల్లికి వందనం పథకం తక్షణమే వర్తింప చేయాలి
● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు బకాయి లేకుండా తక్షణమే జమ చేయాలి.
● జీఓ ఎంఎస్ 11ను రద్దు చేసి, గాలిలో తేలుతున్న 1350 మంది పంచాయతీ సెక్రటరీలకు నియామకాలు చేపట్టాలి. 10 నెలలుగా వేతనాలు లేకుండా బాధపడుతున్న వారి జీతాలను వెంటనే విడుదల చేయాలి.
● స్థానిక సంస్థల బలోపేతం కోసం జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీల గౌరవ వేతనాలను పెంచి, వాయిదా లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ పంచాయతీ వింగ్ అధ్యక్షుడు మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగ సెక్రటరీ గాలివీటి ప్రవీణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, కోడూరు పంచాయతీరాజ్ అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, రాజంపేట పంచాయతీరాజ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్ సుగవాసి ఈశ్వర్‌ప్రసాద్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, సర్పంచ్ రామాంజులు, హరినాథరెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నేతలు