
కార్మిక వేతన భారం మేం భరిస్తాం
మదనపల్లె : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యలపై రెండునెలలుగా ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో మొట్టమొదటగా అన్నమయ్యజిల్లా మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ స్పందించింది. మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు 27 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకాని, ఆ పార్టీ నేతలు కాని పట్టించుకోలేదు. కనీసం పరామర్శించి డిమాండ్లు ఏమిటో అడిగింది లేదు. కార్మికుల సమస్యలపై మానవీయ కోణంలో మున్సిపల్ కౌన్సిల్ స్పందించింది. సోమవారం సాయంత్రం నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్మికులు హాలు ముందు బైఠాయించారు. వారు డిమాండ్ చేస్తున్న వేతనాలపై వైస్ చైర్మన్ జింకా చలపతి, కౌన్సిలర్ ప్రసాద్‌లు సమావేశంలో చర్చించారు. మున్సిపాలిటి తరపున వ్యత్యాస వేతనం చెల్లించేందుకు మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇప్పుడు చెల్లిస్తున్న వేతనానికి ఎంత అదనంగా అడుగుతున్నారో ఆ మొత్తాన్ని మదనపల్లె మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లిస్తామని ప్రకటించి ఈ మేరకు తీర్మాణం చేస్తున్నట్టు ప్రకటించారు.
సేవలకు ప్రతిరూపం పదవీ విరమణ
రాయచోటి : రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందడం వారి సేవల కు ప్రతి రూపమని జిల్లా కలెక్టర్ ఛామకూ రి శ్రీధర్ అన్నారు. సోమవారం పదవీ విరమణ పొందిన మదనపల్లి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ దైవాదీనంలను కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ, పదవీ విరమణలు సర్వసాధారణమన్నారు. రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలంపాటు విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహ కుమార్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
ఒంటిమిట్ట : గత నెల 24వ తేదీ ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణ వేదిక వద్ద కడప–చైన్నె జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న సాయి ప్రకాష్ (25) సోమవారం మృతి చెందాడు. పోలీసు వివరాల మేరకు జూన్ 24వ తేదీన మంత్రాలయం నుంచి కడప వైపు వెళ్తున్న సాయి ప్రకాష్ ద్విచక్ర వాహనానికి రాజంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో రెండు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తలకు తీవ్ర గాయం కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం సోమవారం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సాయి ప్రకాష్ తండ్రి నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో మొదట స్పందించిన మదనపల్లె మున్సిపాలిటీ

కార్మిక వేతన భారం మేం భరిస్తాం

కార్మిక వేతన భారం మేం భరిస్తాం