
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఒంటిమిట్ట: మండలంలోని మల్లేశ్వరపురానికి చెందిన అలిశెట్టి లక్ష్మీదేవి (57) సోమవారం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు జూన్ 14వ తేదీన అలిశెట్టి లక్ష్మీదేవి, ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురు విద్యుత్ త్ వైర్ల విషయమై వారి దాయాదులైన మరో వర్గానికి చెందిన ఆరుగురితో ఘర్షణ పడ్డారు. జూన్ 14న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వారి మధ్య సఖ్యత కుదరకపోవడంతో జూన్ 28వ తేదీ రెండో వర్గంలోని 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా జూన్ 29వ తేదీన అలిశెట్టి లక్ష్మీదేవి అనారోగ్యంతో కడపలోని ప్రైవేటు ఆసు పత్రిలో చేరగా అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అలిశెట్టి లక్ష్మీదేవి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమె చిన్న కూతురు శిరీషా జూన్ 14వ తేదీన జరిగిన ఘర్షణలో తన తల్లికి లోపల గాయాలు తగలడంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలై మృతి చెందినట్లు అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుమారుడితో సహా తండ్రి అదృశ్యం
మదనపల్లె రూరల్ : కుమారుడితో సహా తండ్రి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన నారాయణ కుమారుడు మునిరత్నం(42) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి మద్యానికి తీవ్రంగా బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో ఒకసారి కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత కూతురు ఇంటికెళ్లాలని పట్టుబట్టడంతో తీసుకువచ్చి ఇంటివద్ద దింపేశాడు. ఈ క్రమంలో ఈనెల 23న భార్య ఆదిలక్ష్మితో గొడవపడి కుమారుడు మనోజ్‌కుమార్(7)ను వెంటతీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదిలక్ష్మి సోమవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి