
వేర్వేరు ఘటనల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం అడవిచెరువు గ్రామానికి చెందిన పెద్దినాయుడు(30), అమరనారాయణ(45), అతని భార్య అనూరాధ(40), ప్రతాప్‌నాయుడు(38) తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి సోమవారం ఉదయం కారులో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యంలోని చింతపర్తి సమీపంలో హైవే వద్ద వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన వెంకటరమణ కుమారుడు పి.గంగాద్రి(32) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె జెడ్పీహైస్కూల్ నుంచి ఉపాధ్యాయురాలిని తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంలో వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కుడి కాలు విరిగింది. అదేవిధంగా బీహార్‌కు చెందిన టైల్స్ కార్మికులు అశోక్‌సహానీ(45) ములకలచెరువులో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం రూమ్ నుంచి పని ప్రదేశానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా, వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తగిలిన గాయంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.

వేర్వేరు ఘటనల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు