
గుళ్లు..గోపురాలు చూసేందుకు వచ్చాం
పెద్దతిప్పసముద్రం : ఏదో గుళ్లు, గోపురాలు చూసేందుకు వచ్చాం..ఇదేం అధికారిక కార్యక్రమం కాదు అని తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వెంట 12 వాహనాల్లో ఎస్‌ఈ, ఈఈ, డీఈలు, కాంట్ట్రాకర్లతో కలసి పెద్దతిప్పసముద్రంలోని హంద్రీనీవా కాలువ పంప్ హౌస్‌కు విచ్చేశారు. కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు వెళ్లారు. కాలువ పనులను పరిశీలించారు. అంతమంది అధికారులతో వచ్చిన సీఈని కలిసిన మీడియా ప్రతినిధులు ఆకస్మిక పర్యటన వివరాలను తెలియజేయాలని కోరారు. మీరు రాసుకునే అంత వివరాలైతే ఏం లేవు, ఏదో గుళ్లు, గోపురాలను చూడటానికి వచ్చామని సమాధానం ఇచ్చారు. ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే పర్యటన లాగా కాన్వాయ్‌ను తలపించేలా 12 వాహనాల్లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికార బృందం రావడం వివరాలను గోప్యంగా ఉంచడం వెనుక మతలబు ఏమిటో అధికారులకే ఎరుక. అధికారులు పర్యటించిన ప్రాంతంలో సీఈ చెప్పినట్టు గుళ్లు, గోపురాలు లేవు. కరువుతో బీళ్లు వారిన పొలాలు, పారని హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ కనిపిస్తాయి. గుళ్లు, గోపురాలు లేని కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు ఎందుకు వెళ్లారు. ఆయన వెంట అధికారుల బృందం ఎందుకొచ్చిందో ఆయనే చెప్పాలి.