
వైద్యుడు.. కనిపించే దేవుడు
ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యులు దేవుళ్లతో సమానం. మనిషి అనారోగ్యం బారిన పడిన సమయంలో వైద్యుడు చేసే సేవలు వెలకట్టలేనివి. తల్లి జన్మనిస్తే.. వ్ర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, రిస్క్‌తో కూడిన శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వివిధ జబ్బులతో మనిషి బాధపడాల్సి వస్తుంది. రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. అనేక మంది వైద్యులు మానవత్వంతో పేదలకు, అభాగ్యులకు వైద్యం అందించి వారి ప్రాణాలను నిలుపుతున్నారు. అందుకే వైద్యో నారాయణో హరి అంటుంటారు పెద్దలు. రోగి పరేషాన్‌కు ఏ ఆపరేషన్ చేయాలో వైద్యుడికే తెలుస్తుంది. నాడి పట్టి గుండె గుబుళ్లను గుర్తించి దిగులును దూరం చేసే కనిపించే దేవుడే వైద్యుడు.
రాజంపేట టౌన్ : వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అందువల్లే వైద్యులకు సమాజంలో ఎంతో గుర్తింపు, గౌరవం దక్కుతుంది. కొన్ని రకాల జబ్బుల బారిన పడిన వారి వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడుతుంటారు. అయితే అలాంటి రోగుల వద్దకు కూడా వెళ్లి వైద్యం చేసేది ఒక్క వైద్యుడు మాత్రమే. ప్రతి శాఖలో ఉద్యోగులకు, చివరికి దినసరి కూలీలకు కూడా సెలవులుంటాయి. కాని వైద్యులకు మాత్రం సెలవు ఉండదు. కొన్ని సందర్భాల్లో క్షణం తీరిక కూడా ఉండదు. పిల్లలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు కూడా కొంత మంది వైద్యులకు సమయం ఉండదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
చేదు అనుభవాలు..
వైద్యులకు ఆదివారాలు ఉండవు. ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే. రోగి ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు తమ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. అలాంటి వైద్యులకు ఒక్కో మారు చేదు అనుభవాలు సైతం ఎదురవుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు సరైన సమయానికి వైద్యుడి వద్దకు తీసుకురాలేక చివరి దశలో వైద్యుడి వద్దకు తీసుకొస్తే వైద్యుడు ఆ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో వైద్యుడు మనిషి ప్రాణాలను కాపాడలేక పోతాడు. ఆ సందర్భంలో మృతుని కుటుంబ సభ్యులు ముందూ వెనకా ఆలోచించకుండా ఆందోళనకు దిగడం, దాడులు చేయడం అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరమనే చెప్పాలి.
మానసిక ఒత్తిడి ఎక్కువే..
వైద్యులకు వ్యక్తిగత జీవితాల్లో మానసిక ఒత్తిళ్లు ఎక్కువే ఉంటాయి. వృత్తిలోని సాధకబాధకాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వైద్యులు అదే వృత్తిలో ఉన్న వారిని తమ జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. రోజంతా రోగుల సేవలో కనిపించే వైద్యులు వేడుకలు, పండుగల్లో కనిపించడం చాలా అరుదు. అందులో ఇబ్బందులున్నా ఎదుర్కొంటారు కాని ఇతరులకు చెప్పరు. అలాంటి వైద్యులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
జగన్ హయాం నుంచి పల్లెలకు విస్తరించిన వైద్య సేవలు..
ఒకప్పుడు చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి చేసినా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంతో దూరంలో ఉండే పీహెచ్‌సీలకు లేకుంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆసుపత్రులకు వచ్చి వైద్య సేవలు పొందేవారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన 104 వాహనాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటిముంగిటకే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 104 వాహనాల ద్వారా వైద్య సిబ్బంది నెలలో రెండు రోజులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. అయితే 2019వ సంవత్సరంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకున్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి.
పూర్వజన్మ సుకృతం
వైద్యవృత్తిలో ఎంతో సంతృప్తి ఉంటుంది. రోగులకు వైద్య సేవలు అందించడం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. నేను ఎంతో ఇష్టంగా ఈ వృత్తిని ఎంచుకున్నాను. అనేక సర్జరీలు చేశాను. సర్జరీలు విజయవంతంగా పూర్తి అయిన ప్రతిసారి ఎంతో ఆనందంగా ఉంటుంది. సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న ఈ వృత్తిలో నేను ఉండటం ఎంతో ఆనందంగా ఉంది.
– డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు,
సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
పేదల వైద్యుడు జీవీ సుబ్బారెడ్డి
రాజంపేట పట్టణంలో దాదాపు యాభై ఏళ్లుగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జీవీ సుబ్బారెడ్డి పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందారు. నామమాత్రపు ఫీజుతో ఆయన మెరుగైన వైద్యం అందిస్తారు. అందువల్ల ఆయన వద్దకు ఇప్పటికీ పెద్దఎత్తున పేద ప్రజలు వైద్యం పొందేందుకు వస్తుంటారు. నామమాత్రపు ఫీజు కూడా ఇచ్చుకోలేని వారి వద్ద ఆయన ఒక్కపైసా కూడా తీసుకోకుండానే వైద్యం అందిస్తారు. అందువల్లే డాక్టర్ జీవీ.సుబ్బారెడ్డిని రాజంపేట ప్రాంత ప్రజలు పేదల డాక్టర్ అని ఎంతో అభిమానిస్తారు.
మీ సేవలకు వందనం
రోగుల ప్రాణాలు కాపాడటంలో శక్తి వంచన లేకుండా శ్రమించే దేవుళ్లు
నేడు డాక్టర్స్ డే

వైద్యుడు.. కనిపించే దేవుడు

వైద్యుడు.. కనిపించే దేవుడు