
టీడీపీ నాయకుల దౌర్జన్యం
రాయచోటి : కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూ ఆక్రమణలే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములను సైతం దౌర్జన్యంగా ఆక్రమించి సొంతం చేసుకుంటున్న ఉదంతాలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో భూఆక్రమణలు వెలుగుచూస్తున్నాయి. గాలివీడు మండలం కొర్లకుంట పంచాయతీ చావిడిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పేరం సురేంద్రారెడ్డి పేరున ఉన్న 65 సెంట్ల పట్టా భూమిని టీడీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించి కంచ వేసేశారు. గ్రామ పొలంలోని సర్వే నంబర్ 183/1లో 0.65 ఎకరాల పట్టా భూమిలో ఉన్న వేపచెట్లను నరికి తరలించుకుపోయారు. ఈ విషయంపై స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. గత కొన్ని నెలలుగా సురేంద్రారెడ్డికి చెందిన నిమ్మతోటకు నీరు వేసుకోవడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. భూ ఆక్రమణల సమయంలో ఘర్షణకు దిగిన వైఎస్సార్‌సీపీ నాయకులపైన కేసులు బనాయించి ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టాలన్న దురుద్దేశంతోనే స్థానిక నాయకులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సురేంద్రారెడ్డి భూమిలోని చెట్లను తొలగించి జేసీబీల సాయంతో భూమి అంతా చదును చేసి రాత్రికి రాత్రే మామిడిమొక్కలు నాటి ఆ పొలం చుట్టూ రాళ్లు నాటి కంచె వేశారు. భూఆక్రమణ సమయంలో స్థానికంగా ఉన్న టీడీపీ నేత తన అనుచరులతో కలిసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసినట్లు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వన్–బి, అడంగల్, ఆర్‌హెచ్ నకల్ నమూనాలలో కూడా సురేంద్రారెడ్డి పేరున రికార్డు అయింది. స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆక్రమణల విషయంపై గాలివీడు తహసీల్దార్, పోలీస్‌స్టేషన్, జిల్లా కలెక్టర్ స్థాయి వరకు విన్నవించుకున్నా న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి భూమి రికార్డులను పరిశీలించి, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల
పట్టా భూమి ఆక్రమణ
రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ తిరిగినా జరగని న్యాయం

టీడీపీ నాయకుల దౌర్జన్యం