
ముళ్ల పొదల్లో ఆలయం హుండీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయ చెరువు కట్టపై వెలసిన గంగమ్మ ఆలయం హుండీని రెండు నెలల క్రితం గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. హుండీని పగల గొట్టేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం చెరువు కట్ట కింద సమీప ముళ్ల పొదల్లో దుండగులు పడేసిన హుండీని పశువుల కాపరులు గుర్తించారు. విషయం తెలుసుకున్న చెరువు సంఘం అధ్యక్షుడు మండ్లిపల్లి రమేష్ బాబు, ఆలయ పూజారి నరసింహులు, పెద్ద నీరుగట్టి రెడ్డెప్పలు ఘటనా స్థలానికి చేరుకుని హుండీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హుండీ తాళాలు తీసి అందులో ఉన్న రూ.1,400ల నగదును ఆలయ పూజల కోసం వినియోగించాలని పూజారికి అందజేశారు. మండలంలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీల కారణంగా ప్రజలు హడలెత్తిపోతున్నారు. చోరీల విషయంపై ఎస్‌ఐ హరిహర ప్రసాద్‌ను వివరణ కోరగా గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించినా తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించామన్నారు.