
ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు
నందలూరు : మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద ముగ్గురు దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారం, రూ.14 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఆదివారం మధ్యాహ్నం దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ఆవుల సంజయ్య, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల ప్రమీల అనే వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఈమేరకు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంటకు చెందిన వారన్నారు. వీరిపైన నందలూరులో రెండు కేసులు, వేంపల్లి, పులివెందుల, అనంతపురం 3వ టౌన్, ఆళ్లగడ్డ టౌన్, నంద్యాల వన్ టౌన్‌లలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. అంతర్ జిల్లాల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.
రూ.25 లక్షల బంగారు నగలు స్వాధీనం