
● ఐదు మండలాలు జిల్లాలోకి...
మదనపల్లె: అడక్కుంటే అమ్మైనా అన్నం పెట్టదు అన్నది సామెత. అయితే పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తాము ఉంటున్న చిత్తూరుజిల్లా నుంచి తప్పించి అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేయండని అడగకపోయినా ప్రభుత్వమే రాజకీయ నిర్ణయం తీసుకుని విభజన చేస్తోంది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విన్నవించుకుంటారు. అయితే ఎవరూ అభ్యర్థించకపోయినా ఒక ప్రాంత ప్రజలను, భౌగోళికంగా అనువైన పరిస్థితుల నుంచి తప్పించి మరో ప్రాంతంలో కలిపితే దాన్ని రాజకీయ విభజన అని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిత్తూరుజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్యజిల్లాలోకి కలపాలంటూ ప్రజల నుంచి వినతులు లేకపోయినా ప్రభుత్వం రాజకీయ విభజన చేపట్టింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతూ ఉత్తర్వు రావడం, అదేరోజు అన్నమయ్యజిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. నెలరోజుల గడువుతో అభ్యంతరాలను ఆహ్వనించిన ప్రభుత్వం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేసేందుకు సిద్ధమైపోయింది.
అభ్యంతరం లేకుండా విభజన
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరుజిల్లాను విభజించి కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ విషయంలో ఒక్క అభ్యంతరం లేకుండా ప్రజలకు అనుకూలమైన విధంగా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడిజిల్లాకు చెందిన పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరుజిల్లాలో ఉంచేసి, మిగిలిన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను అన్నమయ్యజిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీనితో సునాయసంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. పుంగనూరు నియోజకవర్గం చిత్తూరులో కొనసాగించే విషయంలోనూ అభ్యంతరాలు లేవు. అంటే నియోజకవర్గ ప్రజలు చిత్తూరులో కొనసాగేందుకు సముఖత వ్యక్తం చేశారు. కూటమి రాగానే విభజన మంత్రం అందుకుంది.
అడక్కుండానే మార్పు
పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తమను అన్నమయ్యజిల్లాలోకి విలీనం చేయాలన్న విన్నపాలు తెరపైకి తేలేదు. ఇప్పుడున్న స్థితినే కోరుకున్నారు. డివిజన్ కేంద్రం మదనపల్లెకు రావడం కంటే చిత్తూరు కేంద్రం దగ్గరని ఇక్కడి ప్రజలకు తెలుసు. మదనపల్లెకు చౌడేపల్లి, పుంగనూరు పట్టణం మినహా మిగిలిన సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలాలు భౌగోళికంగా పాలనాపరంగా చిత్తూరు దగ్గరలో ఉంటుంది. పులిచర్ల మండలం చిత్తూరు, తిరుపతిజిల్లా కేంద్రాలకు సమీపంలో ఉంటుంది. మిగిలినవన్నీ మదనపల్లెకు దూరంగా ఉంటాయి. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మదనపల్లె డివిజన్‌లో కలిపేసేందుకు నిర్ణయించింది.
పెద్దిరెడ్డిపై కక్షతోనే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై రాజకీయంగా కక్ష సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులకు గురి చేసే యత్నాలు సాగాయి. అందులో నిజాలు లేవని తేలిపోవడంతో ప్రభుత్వం రాజకీయంగా దెబ్బతిసేలా అభివృద్ధి పనులు, రిజర్వాయర్ల పనులను అడ్డుకుంది. అయినా దాహం తీరని ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరునుంచి వేరుచేసి అన్నమయ్యజిల్లాలో కలిపేందుకు సిద్ధమై ఈ మేరకు చర్యలు పూర్తి చేస్తోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చిత్తూరుజిల్లాలో పుంగనూరు ఉంచడంపై ఒక్క అభ్యంతరం లేదు
ప్రస్తుతం ఎవ్వరూ అడక్కపోయినా అన్నమయ్యజిల్లాలో కలిపేందుకుప్రభుత్వం నుంచి చకచకా ఆదేశాలు, అమలు
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, ఒక మున్సిపాలిటీని అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేయనున్నారు. అయితే పులిచర్ల మండలం మదనపల్లె డివిజన్‌లోకి మారే విషయంలో ప్రజల నుంచి చిత్తూరు కలెక్టరేట్‌కు అభ్యంతరాలు వచ్చాయి. అలాగే అధికార టీడీపీ నేతలు చిత్తూరు లేదా తిరుపతి డివిజన్‌లో కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అన్నమయ్యజిల్లాలోకి ఐదు మండలాలు కలిపితే అవి మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లోకి కలుపుతారు. వీటిలో రొంపిచర్ల పీలేరుకు దగ్గర్లో ఉంటుంది, మదనపల్లెకు 80 కిలోమీటర్లకుౖపైగా దూరం కాబట్టి రాయచోటి డివిజన్‌లో కలిపే అవకాశం లేకపోలేదు. దీంతో మండలాల సంఖ్య 35కు, పుంగనూరు మున్సిపాలిటీతో కలిపి మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేఽరుతుంది. ఒక నగర పంచాయతీ ఉంటుంది. 32.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,29,261 మంది. ఇది భౌగోళికంగా తూర్పున తిరుపతిజిల్లా, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరాన అన్నమయ్యజిల్లా సరిహద్దు కలిగి ఉంది. ఈ విలీనం తర్వాత అన్నమయ్యజిల్లా స్వరూపం మారిపోనుంది.