
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 30వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని తెలిపారు.
క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు
మదనపల్లె సిటీ: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి గౌస్‌భాషా అన్నారు. మదనపల్లె సమీపంలోని వేద పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచి క్రీడపట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పుట్‌బాల్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్, రాష్ట్ర పరిశీలకులు సిరాజ్‌అహ్మద్, చినబాబు,కమలేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, వైజాగ్ జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి.
రెడ్డెమ్మా..కరుణించమ్మా...
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి వేకువజామునే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానం ఆచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు.రాయలసీమ జిల్లాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.