
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక లక్ష్మీహాలు సమీపంలో నివాసముంటున్న రాజకుళ్లాయమ్మ అనే మహిళ ఈనెల 18న కడప రిమ్స్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం రాజకుళ్లాయమ్మ కడప రిమ్స్ నుంచి పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పసికందును రాజకుళ్లాయమ్మ స్నేహితురాలు కుమారి అపహరించి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలు కుమారి తమ బంధువుల ఇంటి దగ్గర ఉండడంతో పులివెందుల పోలీసులు ఆమెను అరెస్టు చేసి పులివెందుల స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ రాజకుళ్లాయమ్మ, కుమారి ఇద్దరూ పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంలుగా పనిచేస్తున్నారని తెలిపారు. కుమారి శుక్రవారం రాజకుళ్లాయమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందును అపహరించి తీసుకెళ్లిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే పసికందును కిడ్నాప్ చేసిన నిందితురాలిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.