
విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి
రాయచోటి టౌన్ : విద్యుత్ వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాయచోటి ట్రాన్స్‌కో డివిజన్ శాఖ సూపరింటెంటెంట్ ఇంజనీరు ఆర్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాయచోటి విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయంలో విద్యుత్ భద్రతా వారోత్సవాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే విద్యుత్ వినియోగంపై సరైన ప్రణాళిక ఉంటుందన్నారు. విద్యుత్ వాడకంలో అనేక సందర్భాలలో జాగ్రత్తలు పాటించకుండా ఉండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాగే అధిక విద్యుత్ వినియోగం చేస్తుంటామన్నారు. అనేక చోట్ల విద్యుత్ లైన్‌లు ఉన్నప్పటికీ ఆ లైన్ కిందనే ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటారని, దీని వలన ప్రమాదాలు జరుగుతుంటాయని, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారన్నారు. విద్యుత్ లైన్ కింద ఇళ్ల నిర్మాణాలు చేయరాదని సూచించారు. ఈ క్రమంలో ఏడు సూత్రాలు కలిగిన పోస్టర్ ప్రజల అవగాహన కోసం ప్రదర్శనకు ఏర్పాటు చేశారు.