నియంతను తలపిస్తున్న చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

నియంతను తలపిస్తున్న చంద్రబాబు

Jun 28 2025 8:07 AM | Updated on Jun 28 2025 8:07 AM

నియంతను తలపిస్తున్న చంద్రబాబు

నియంతను తలపిస్తున్న చంద్రబాబు

కూటమి పాలనలో సంక్షేమం..

అభివృద్ధి లేదు: రాజ్యసభ సభ్యుడు మేడా

కూటమి పాలనలో సంక్షేమం..అభివృద్ధి లేవని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సంపద సృష్టిస్తామని తరచూ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు తన నారా కుటుంబానికి, తన కోటరీ వాళ్లకు మాత్రమే సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయమని అడిగిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యకర పాలనకు తెరతీశారన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

రాయచోటి: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, చంద్రబాబు నియంతను తలపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాయచోటిలో శుక్రవారం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కంటే మెరుగ్గా పథకాలను అందిస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మోసపోయిన రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అయన అన్నారు.ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అయిందని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా సమయంలోనూ అప్పటి సీఎం జగన్‌ ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయకుండా వంద శాతం హామీలను నెరవేర్చారన్నారు. ప్రజలకు నేరుగా రూ.3 లక్షల కోట్ల నిధులను అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అన్నారు. 2014 సమయంలోనూ జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను తొలగించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గడప గడపకు వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను తెలియపరుస్తూ గత వైసీపీ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలకు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు అర్థం అవుతాయన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనకు, కూటమి నయవంచన పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా రాజకీయాలలో మంచి ప్రాధాన్యం కలిగిన సుగవాసి కుటుంబం నుంచి వచ్చిన బాలసుబ్రమణ్యం ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీలో చేరడం సంతోషమన్నారు. జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. పార్టీలో ఆయనకు మంచి ప్రాధాన్యత, భవిష్యత్తు ఉంటాయని మాజీ మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సుగవాసి సుబ్రమణ్యం, నిస్సార్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు

● సూపర్‌ సిక్స్‌తో పాటు 146 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒకటి రెండు మినహా ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై కూడా కూడా అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణం అన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎన్నికల సమయంలో టపాసులు పేలి కన్ను దెబ్బతిందన్న నెపంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డిలతో సహా 19 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. బద్వేలులో శ్రీకాంత్‌రెడ్డి అనే పార్టీ వర్గీయుడి ఇంటిని అక్రమంగా కూల్చేశారన్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ప్రజల వద్దకు వస్తారని, ఏఏ హామీలు నెరవేర్చారో చెప్పే వరకు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు.

● జగన్‌ ప్రజాక్షేత్రంలోకి వస్తుంటే టీడీపీకి గుండెలు అదురుతున్నాయని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో జగన్‌కు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ప్రతి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త జగన్‌ అడుగుజాడల్లో అడుగేసి పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా కూటమి పాలనపై వ్యతిరేకత వినిపిస్తోందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ ఆదేశానుసారం ప్రజలలోకి వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని చెప్పారు.

● చంద్రబాబు పాలనపై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పల్లెలు, పట్టణాలలో ఎక్కడకు వెళ్లినా టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలే నిర్భయంగా చెబుతున్నారన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. 2029లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యం అని అన్నారు.

● కూటమి పాలనలో రైతుల పరిస్థితి దీనంగా మారిందని మదనపల్లె ఇన్‌చార్జి నిస్సార్‌అహమ్మద్‌ ధ్వజమెత్తారు. కూటమి నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మామిడి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారన్నారు. రాబోయే రోజుల్లో జగన్‌ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.

● చంద్రబాబు పాలనలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందని జెడ్పీ మాజీ చైర్మన్‌, ఇటీవల టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరగడం లేదని ఆ పార్టీల్లో ని 164 శాసనసభ్యులలో ఎవరైనా కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని సవాల్‌ విసిరారు. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినవవి ఒకటి, అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకొకటి చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలను మేలుకొలపాలన్నారు. మీలో ఒక్కడిగా, తోడుగా ఉండి వైఎస్‌ఆర్‌సీపీ విజయానికి కృషి చేస్తానని బాలసుబ్రమణ్యం ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనూజారెడ్డి, ఏపీఎండీసీ మాజీ ఛైర్‌పర్సన్‌, వైఎస్‌ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు షమీంఅస్లాం, జిల్లా మహిళా నాయకురాళ్లు అజంతమ్మ, మహిత తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలి

వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement