నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి

Jun 28 2025 8:07 AM | Updated on Jun 28 2025 8:07 AM

నిర్ద

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి

రాయచోటి: స్వర్ణాంధ్ర విజన్‌–2047 పకడ్బందీ అమలులో భాగంగా నియోజకవర్గ యాక్షన్‌ ప్లాన్‌లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సచివాలయ సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుపరిపాలన తొలి అడుగు, నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌పై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ప్రధాన సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించుకొని జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. డేటా మేనేజ్మెంట్‌,, డేటా అనాలసిస్‌లో సచివాలయ సిబ్బంది చురుగ్గా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్‌ వద్ద

పటిష్ట నిఘా ఉండాలి

రాయచోటి: జిల్లా కేంద్రంలో ఈవీఎంలను భద్రపరిచి గోదాము వద్ద 24–7 ప్రకారం నిరంతరం పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్‌ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బీయులు, సీయూలు, వీవీ ప్యాట్‌లను, అక్కడ భద్రతా చర్యలను కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్‌ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె మధుసూదన్‌రావు, ఆర్డీఓ ఏ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నరసింహకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గంలో అక్కులప్ప

మదనపల్లె రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గంలో మదనపల్లెకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ బండపల్లి అక్కులప్పకు మరోసారి అవకాశం లభించింది. ఒంగోలులో ఈనెల 25, 26 తేదీల్లో రెండురోజుల పాటు జరిగిన 36వ రాష్ట్ర మహాసభల్లో అక్కులప్ప రాష్ట్ర కార్యవర్గంలోకి ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన ఆయనకు ఏపీయూడబ్ల్యూజేతో సుమారు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 1996లో మొదటిసారి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై న అక్కులప్ప, ఆపై జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా ఏపీయూడబ్ల్యూజేలో వివిధ హోదాల్లో పనిచేశారు. అన్నమయ్యజిల్లా నుంచి జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్న అక్కులప్పను తాజాగా రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు.

కూటమి ప్రభుత్వానికి

ఉద్యోగుల సెగ

కురబలకోట: కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. వివిధ శాఖల ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. బదిలీల జీఓలో అస్పష్టత ఉందని ఇటీవల సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా గ్రామ కార్యదర్శులు సమస్యల పరిష్కారం కోసం శనివారం సామూహిక సెలవులో వెళుతున్నారు. పని భారం ఎక్కువ, గ్రూప్‌ మీట్స్‌ అధికం కావడం, పీజీఆర్‌ఎస్‌ పనులు,ఇతర శాఖల అధికారుల పెత్తనం, సర్వేల భారం, తీవ్రమైన పనితో వ్యాధులు బారిన పడటం, విధి నిర్వహణలో తీవ్ర వత్తిడి కారణంగా అకాల మరణాలు సంభవించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కల్టెక్టర్‌ను కలసి వినతి పత్రం ఇస్తున్నట్లు పంచాయతీ కార్యదర్సుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సామూహిక సెలవు కోరుతూ ఎంపీడీఓలకు గ్రామ కార్యదర్శులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కురబలకోట ఎంపీడీఓ గంగయ్యకు కూడా మండలంలోని గ్రామ కార్యదర్సులు సామూహిక సెలవులో వెళుతున్నట్లు వినతి పత్రం అందజేశారు. పాలనలో అనుభవం ఉందని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వరుసగా వివిధ శాఖల ఉద్యోగులు నిరసనల పర్వం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి 1
1/1

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement