
ఏటీఎం కార్డు తస్కరించి రూ.25 వేలు డ్రా
నందలూరు : మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏటీఎంలో ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు తస్కరించి రూ.25 వేలు డ్రా చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడు విశ్రాంత ఉపాధ్యాయుడు సానిపాటి నరసింహులు వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఏటీఎం కార్డును చోరీ చేసి ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.25 వేలు డ్రా చేసుకున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు.
నాటు సారా కేసులో ఒకరి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం బుడిగుంటపల్లి పంచాయతీ, దేశెట్టిపల్లి క్రాస్ వద్ద నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ తులసీ మాట్లాడుతూ నాటుసారా, అక్రమ మద్యం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు ప్రాధాన్యం పెంచాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో స్పోర్ట్స్ రంగంలో తలెత్తిన ఫేక్ సర్టిఫికెట్స్ సమస్యలపై దృష్టి సారిచి వాటికి అడ్డుకట్ట వేసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు ప్రాధాన్యత పెంచాలని ఏపీపీఈటీస్ అండ్ ఎస్‌ఏపీఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కిరణ్, సభ్యులు కోరారు. ఈ విషయమై రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాయచోట్‌లోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో కలసి వినతిపత్రం అందజేశారు.