
సమస్యాత్మక ప్రదేశాల్లో కూంబింగ్
సిద్దవటం : సిద్దవటం రేంజిలోని గొల్లపల్లె సెక్షన్‌లోని సమస్యాత్మక ప్రదేశాలలో కూంబింగ్ నిర్వహించామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం రేంజర్ మాట్లాడుతూ కడప డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్ ఆదేశాల మేరకు సిద్దవటం ఫారెస్టు రేంజి పరిధిలోని గొల్లపల్లె, రోళ్లబోడు, ఫారెస్టు బీట్లలో సమస్యాత్మక ప్రదేశాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం సోమవారం నుంచి కూంబింగ్ నిర్వహించామన్నారు. అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో ప్రజలకు ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేస్, ఫారెస్టు బీటు ఆఫీసర్లు మధు, ఆది విశ్వనాథ్, పెంచల్‌రెడ్డి, అసిస్టెంటు బీటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
ఓబులవారిపల్లె : వై.కోట చెరువు అలుగు వద్ద మంగళవారం ఎర్రచందనం దుంగలను కారులోకి ఎక్కిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పక్కా సమాచారంతో చెరువు అలుగు సమీపానికి చేరుకోగానే అక్కడ కారులోకి ఎర్రచందనం దుంగలు మోస్తూ ఏడుగురు తారసపడ్డారని తెలిపారు. తమను చూడగానే రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తాము చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారివద్ద నుంచి ఒక కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు, ఆరు మొబైల్ ఫోన్‌లు, ఐదు గొడ్డళ్లు, ఒక రంపం, మూడు టార్చిలైట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు తిరుపతికి చెందిన కారు డ్రైవర్ ముత్యాల వెంకటేష్‌తోపాటు ఆరుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలు ఉన్నారని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాకు సూత్రధారులైన ముగ్గురు స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు అయిన ఏడుగురిని తిరుపతి ఎర్రచందనం కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండుకు తరలించామని వివరించారు.