
జీఓ నంబర్ 5ను రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగుల నిరసన
రాయచోటి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీఓ నంబర్ 5ను రద్దు చేయాలంటూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో భోజన విరామ సమయంలో నిరసన తెలియజేసి అనంతరం డీఆర్‌ఓ మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామవార్డు, సచివాలయం ఎంప్లాయిస్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓల వలన సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ జీఓను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. సొంత మండలం, మున్సిపాల్టీలలోనే పోస్టింగ్స్ ఇవ్వాలని, రేషనలైజేషన్ ప్రక్రియ చేసిన తరువాతనే బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఏపీఎన్‌జీఓ సంఘం తాలుకా ఉపాధ్యక్షులు హరి ప్రసాద్, లక్ష్మీ ప్రస్న, జీనత్, వేణు, యుగంధర్, అధిక సంఖ్యలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.