
ద్విచక్రవాహనాల దొంగను అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడిన దొంగను సోమవారం మదనపల్లెలో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి, 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని కర్ణాటకకు తరలించారు. పట్టణానికి చెందిన హేమంత్(24) బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీచేసి మదనపల్లెలో తలదాచుకున్నాడు. ద్విచక్రవాహనాల చోరీపై కేసుల విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు మదనపల్లెలో ఉన్నట్లు నిర్ధారించుకుని సోమవారం హెచ్‌ఏఎల్ స్టేషన్ ఎస్‌ఐ దామయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వచ్చి నిందితుడు హేమంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ చేసిన వాహనాలు మదనపల్లెలో 10, చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద 15 దాచి పెట్టినట్లు చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి లారీలో ఎక్కించి నిందితుడితో పాటు కర్ణాటకకు తరలించారు.