
అంతర్ జిల్లా కాపర్ వైర్ల దొంగ అరెస్టు
మదనపల్లె రూరల్ : ట్రాన్స్‌ఫార్మర్‌లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్ దొంగతనం చేసే అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి, రూ.11లక్షల 42వేల 600 విలువ కలిగిన 626 కిలోల కాపర్ వైరును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యసాయిజిల్లా ఓబులదేవునిచెరువు మండలం అల్లాపల్లి పంచాయతీ బురుజుపల్లెకు చెందిన గంగిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి రామకృష్ణారెడ్డి(48) తన పక్క గ్రామమైన పగడాలవారిపల్లెకు చెందిన వెంకటేష్‌తో కలిసి అన్నమయ్య, సత్యసాయిజిల్లాలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కాపర్ వైర్ల చోరీకి పాల్పడ్డారన్నారు. ఆయా స్టేషన్ల పరిధిలో వీరిపై 40 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్‌వైర్ల దొంగతనాలకు సంబంధించి 28 కేసులు నమోదయ్యాయన్నారు. అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలంలో 14, మదనపల్లె 1, పీటీఎం 1, ములకలచెరువు 7, గాలివీడు 3, కురబలకోట 1, పుల్లంపేట 2, నందలూరు 1, పీలేరు 2, సత్యసాయిజిల్లా నల్లచెరువు 1, గాండ్లపెంట 2 తలపుల మండలం 3, తనకల్లులో 1 మొత్తం 40 ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ చోరీ చేసినట్లుగా కేసులు నమోదయ్యాయన్నారు. కేసుల విచారణలో భాగంగా జిల్లాకు చెందిన క్రైమ్ సీఐ చంద్రశేఖర్, బి.కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేశామన్నారు. సోమవారం నిందితుల్లో ఒకడైన రామకృష్ణారెడ్డి...బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబళ్లపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, చేతిలో ప్లాస్టిక్ సంచితో వస్తూ, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలకు సంబంధించిన వివరాలను తెలుపుతూ నేరం అంగీకరించాడన్నారు. నిందితుడు తెలిపిన సమాచారం మేరకు బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం రంగసముద్రం ఏరు వద్ద గల చెట్టు పొదల్లో దాచి ఉంచిన 626 కిలోల కాపర్ వైండింగ్ వైరును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో నిందితుడైన వెంకటేష్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన హెడ్‌కానిస్టేబుళ్లు పి.నరసింహులు, శంకర, కానిస్టేబుళ్లు రాఘవరెడ్డి, శివ, శంకర, దొరబాబు, చలపతి, హోంగార్డు సుబ్బయ్యలను అభినందించారు.