రామసముద్రం : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం రామసముద్రం మండలంలో జరిగింది. ఎలవానెల్లూరు పంచాయతీ కొత్తూరుకు చెందిన మేకల వెంకటరమణ (45) కర్ణాటకలోని సోమయాజులపల్లెకు వెళ్లి వస్తుండగా, కర్నాటక సరిహద్దులో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో వెంకటరమణ తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
తండ్రి కోసం తపించి తనయుడి మృతి
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎర్రకొండు శివసాయి(25) కువైట్‌లో ఉన్న తన తండ్రి రాక కోసం పరితపించి అనారోగ్యానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఎర్రకొండు రామకృష్ణయ్య జీవనోపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఎడారిలో పనిచేసేవాడు.
రామకృష్ణయ్య పనిచేస్తున్న సేఠ్ తన పాస్‌పోర్ట్ తీసుకుని తనతో పనిచేయించుకుంటూ పదేళ్లుగా జీతం ఇవ్వడం లేదని, ఇంటికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను ఇటీవల ఇంటికి పంపించాడు. ఆ వీడియోను చూసిన శివసాయి మరింత కుంగిపోయాడు. ఈ బెంగతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికై నా రామకృష్ణయ్యను ఇండియాకు పంపించాలని భార్య, పిల్లలు కోరుకుంటున్నారు.