
కూటమి పాలనలో ఒరిగింది శూన్యం
మదనపల్లె రూరల్ : కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య అన్నారు. అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10వేల కోట్లు నిధులు కేటాయించాలని, జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్, బహుజనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ మదనపల్లె పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు మొరవ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, రూ.15 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయన్నారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో టమాటా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే రైతాంగానికి కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేయకుండా గోదావరి నది బనకచర్ల నుంచి నీళ్లు తెస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కడప నుంచి మదనపల్లె మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిసాహెబ్, బహుజనసేన శ్రీచందు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణప్ప, మనోహర్‌రెడ్డి, సాంబశివ, మురళీ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఎస్.కే.బాషా, మహమ్మద్ షరీఫ్, ఖాదర్‌బాషా, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
జి.ఈశ్వరయ్య