
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
రాయచోటి జగదాంబసెంటర్ : ఏళ్ల తరబడి పనిచేసినా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీవితాలలో మార్పు లేదని కూటమి ప్రభుత్వం స్పందించి జీఓ 36 అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కొనసాగించాలని లేదా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌ఓ మధుసూదనరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ సెక్షన్ అధ్యక్షుడు అక్బర్, ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మీ, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు.