
నామినేటెడ్ పదవుల్లో కురుబలకు ప్రాధాన్యత ఇవ్వాలి
మదనపల్లె రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నామినేటెడ్ పదవుల్లో కురుబ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ కురుబ, కురుమ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు కోరారు. ఆదివారం మదనపల్లె మండలం టిడ్కో గృహాల సమీపంలోని గాయత్రి పార్క్‌లో ఏపీ కురుబ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కురుబ కుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు, కురుబ సంఘం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ యువత, మహిళా, ఉద్యోగుల కమిటీ ఏర్పాటు, తిరుపతిలో కనకదాస విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరణ, కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయింపు విషయమై ప్రభుత్వ పెద్దలను కలవడం తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా కురుబ యువత కమిటీని ప్రకటించారు. సత్యసాయిజిల్లా కురుబ యువత జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొంగటి రమేష్, అనంతపురం జిల్లా రాష్ట్ర కురుబ యువత జాయింట్ సెక్రటరీగా చెలిమి గురుమూర్తి, ఉపాధ్యక్షులుగా కప్పల జమదగ్ని, సత్యసాయిజిల్లా రాష్ట్ర కురబ యువత కార్యదర్శి కొంక నాగార్జున, కురుబ యువత ఉపాధ్యక్షులు బ్యాల్ల పార్థసారధి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కప్పల సుదర్శన్, గౌరవ అధ్యక్షులుగా ఆర్.రాజశేఖర్, కార్యదర్శిగా కె.నాగభూషణకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కురుబ సంఘం జనరల్ సెక్రటరీ వి.లింగమూర్తి, ట్రెజరర్ సి.విఠల్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్లు కె.నాగేశ్వరరావు, కె.రెడ్డికుమార్, సెక్రటరీ వి.వెంకటరమణ, కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.