
చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
వీరబల్లి : చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడం నాగభూషణం కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జగనన్న ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మికుల ఖాతాలో సంవత్సరానికి రూ. 24 వేలు జమ చేసేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికై న మోడం నాగభూషణంను గాలివీటి విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శి గాలివీటి వీరనాగిరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షుడు నరేంద్ర నాయుడు, ఎల్లంపల్లి వార్డు మెంబర్ నాగభూషణం, మట్లి పంచాయతీ చేనేత కార్మికులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.