
దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో దుప్పి మాంసం విక్రయిస్తున్న కొనిరెడ్డి రామసుబ్బారెడ్డి అనే వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారి శ్యామసుందర్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
భర్తపై గొడ్డలితో దాడి
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాదం చోటుచేసుకుని భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ టిడ్కో ఇళ్ల వద్ద నివాసం ఉంటున్న మోహన్ నాయక్(45) తన భార్య శారదతో కుటుంబ అవసరాల కోసం ఉంచిన నగదు ఖర్చు విషయమై వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో గొడ్డలి తీసుకుని శారద భర్త మోహన్‌నాయక్‌పై దాడిచేసింది. దాడిలో మోహన్‌నాయక్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
మద్యానికి డబ్బు ఇవ్వలేదని..
మదనపల్లె రూరల్ : మద్యం తాగేందుకు భార్య నగదు ఇవ్వకపోవడంతో భర్త దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. నెమలినగర్ వడ్డిపల్లెలో భార్యాభర్తలు మోహన్, గాయత్రి నివాసం ఉంటున్నారు. మోహన్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. అందులో భాగంగా ఆదివారం తనవద్ద మద్యం సేవించేందుకు డబ్బు లేకపోవడంతో భార్య గాయత్రిని అడిగాడు. ఆమె తనవద్ద లేదని సమాధానం ఇవ్వడంతో ఆవేశానికి లోనై ఇటుక రాళ్లతో ఆమైపె దాడి చేశాడు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
పొలంలో తెగి పడిన కాలు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ కొత్తపల్లికి చెందిన బైరెడ్డి (38) అనే రైతు కాలు ప్రమాదవశాత్తు తెగి పడింది. వివరాలిలా.. ఆదివారం రోటివేటర్‌తో పొలాన్ని చదును చేసే క్రమంలో వదులుగా ఉన్న రోటివేటర్ బోల్ట్‌లను బిగించే ప్రయత్నం చేస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. దీంతో బోల్ట్‌లు బిగిస్తున్న బైరెడ్డి కాలు మోకాలి వరకు తెగిపోయింది. గ్రామస్తులు వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
మిథున్‌రెడ్డి, ఆకేపాటి భేటీ
రాజంపేట : రాజంపేట లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథ్‌రెడ్డిలు ఆదివారం భేటీ అయ్యారు. పట్టణ శివార్లలో అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనువాసులు, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు చొప్పా ఎల్లారెడ్డి, పుల్లంపేట, రాజంపేట, నందలూరుకు చెందిన నేతలు పాల్గొన్నారు.

దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు