
భర్త మరణాన్ని మరువక ముందే భూమి ఆక్రమణ
కురబలకోట : విద్యుత్ షాక్‌తో భర్తను కోల్పోయి తేరుకోక మునుపే వితంతువు భూమిని ఓ కుటుంబం ఆక్రమించడం మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. కురబలకోట మండలం అంగళ్లులో ఈ దుస్సంఘటన జరగడం కలవరాన్ని కల్గిస్తోంది. మనో వేదనలో ఉన్న వితంతువు భూమిని ఆక్రమించి ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేయడం పట్ల అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయో వృద్ధురాలైన అత్త, మరో వైపు చిన్నబిడ్డలతో ఉన్న ఆమె ఈ దుర్మార్గంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. భూ ఆక్రమణపై బాధితురాలు గాండ్లపెంట శకుంతల ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. మండలంలోని కనసానివారిపల్లెకు చెందిన యువరైతు గాండ్లపెంట రెడ్డెప్పరెడ్డి (38) ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న అతని ఆకస్మిక మృతితో ఆ కుటుంబం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అంగళ్లులో కడప మార్గంలో హైవే పక్కన ఉన్న ఆమెకు చెందిన 92 సెంట్ల భూమిపై మండలంలోని తుమ్మచెట్లపల్లెకు చెందిన ఓ కుటుంబం కన్నేసి ఆక్రమించిందని బాధితురాలు శకుంతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిటిగేషన్ డాక్యుమెంట్ సృష్టించి అధికార పార్టీ అండతో భూ ఆక్రమణకు పాల్పడ్డారని వేదన పడుతోంది. ఏళ్లుగా వంశ పారంపర్యంగా ఆధీనంలో వున్న భూమికి న్యాయం చేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడతామని ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ఆక్రమిత భూమి వద్ద బాధితురాలు అత్త బిడ్డలతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. భర్త ఉన్నప్పుడు భూమి వైపు కన్నెత్తి చూడలేదు. అతను చనిపోయాక దౌర్జన్యంగా భూ ఆక్రమణకు పాల్పడి చుట్టూ ఫెన్సింగ్‌లా రాళ్లు నాటారని తెలిపారు. ఏళ్లుగా ఆధీనంలో ఉంటూ భూ హక్కు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు బుక్కులు కూడా ఉన్న తమ భూమిని ఆక్రమించడం ఏమిటనిఽ బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై అధికారులను విచారించగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు.
న్యాయం చేయకపోతే సామూహిక
ఆత్మహత్యే శరణ్యం
ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు